మీ అపార్ట్మెంట్ పేరు మీదుగా బ్యాంక్ ఖాతా నిర్వహణ – చట్టబద్ధమైన పద్ధతి vs ఆచరణాత్మక పరిష్కారం
అపార్ట్మెంట్ నిర్వహణలో ‘ఆర్థిక క్రమశిక్షణ’ అత్యంత కీలకమైన అంశం. ప్రతి నెలా వసూలయ్యే మెయింటెనెన్స్ డబ్బులను సురక్షితంగా ఉంచడానికి, ఖర్చులకు జవాబుదారీతనం ఉండటానికి ఒక బ్యాంక్ ఖాతా తప్పనిసరి. అయితే, ఈ బ్యాంక్ ఖాతాను ఎలా తెరవాలి? అధికారికంగా ‘అసోసియేషన్ అకౌంట్’ తెరవడం మంచిదా? లేక చిన్న అపార్ట్మెంట్లలో వ్యక్తిగత ఖాతా సరిపోతుందా? ఈ అధ్యాయంలో ఈ రెండు అంశాలను కూలంకషంగా పరిశీలిద్దాం.
📰 ఇవి కూడా చదవండి
అసోసియేషన్ పేరిట బ్యాంక్ ఖాతా – అధికారిక ప్రక్రియ
చట్టపరంగా రిజిస్టర్ అయిన ప్రతి అసోసియేషన్, తనకంటూ సొంత బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి. ఇది వ్యక్తుల అకౌంట్ ఓపెన్ చేసినంత సులభం కాదు, దీనికి కొన్ని ప్రత్యేకమైన చట్టపరమైన పత్రాలు మరియు స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ అవసరం.
దశ 1: అసోసియేషన్ పాన్ కార్డ్ (PAN Card Application) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ చేతికి వచ్చిన వెంటనే చేయాల్సిన మొదటి పని పాన్ కార్డ్ తీసుకోవడం. అసోసియేషన్ అనేది ఒక “న్యాయపరమైన వ్యక్తి” (Juridical Person) కాబట్టి దానికి పాన్ కార్డ్ తప్పనిసరి.
-
ఆన్లైన్లో లేదా పాన్ సెంటర్లో ‘Form 49A’ ద్వారా దరఖాస్తు చేయాలి.
-
దరఖాస్తులో స్టేటస్ ‘Association of Persons (AOP)’ లేదా ‘Artificial Juridical Person’ అని పేర్కొనాలి.
-
రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ప్రూఫ్‌గా జతచేస్తే, సుమారు 10-15 రోజుల్లో పాన్ కార్డ్ వస్తుంది.
దశ 2: రబ్బర్ స్టాంపుల తయారీ (Rubber Stamps) బ్యాంకు లావాదేవీలకు కేవలం సంతకాలు సరిపోవు, అధికారిక ముద్రలు (Seals) కావాలి. కింది వాటిని తయారు చేయించుకోవాలి:
-
రౌండ్ సీల్ (Round Seal): అసోసియేషన్ పేరు, రిజిస్ట్రేషన్ నంబర్ మరియు ఊరి పేరుతో గుండ్రని సీల్.
-
హోదా స్టాంపులు (Designation Stamps): President, General Secretary, Treasurer.
-
ఆథరైజ్డ్ సిగ్నేటరీ స్టాంప్: “For [అసోసియేషన్ పేరు] …. Authorised Signatory” (ఇది చెక్కుల మీద వాడతారు).
దశ 3: కమిటీ తీర్మానం (Passing a Resolution) బ్యాంకుకు వెళ్లే ముందు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశమై అధికారికంగా ఒక ‘తీర్మానం’ (Resolution) పాస్ చేయాలి. అసోసియేషన్ లెటర్ హెడ్ మీద కింది అంశాలు స్పష్టంగా ఉండాలి:
-
“మేము [బ్యాంక్ పేరు] లో [అసోసియేషన్ పేరు] మీద సేవింగ్స్/కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలని నిర్ణయించాము.”
-
“ఈ అకౌంట్‌ను ప్రెసిడెంట్, సెక్రటరీ మరియు ట్రెజరర్లలో ఎవరైనా ఇద్దరు (Any two of three) జాయింట్‌గా ఆపరేట్ చేస్తారు.”
-
కమిటీ సభ్యులందరూ దీనికి ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాలి.
దశ 4: డాక్యుమెంట్ల సమర్పణ (Submission) బ్యాంకుకు వెళ్లేటప్పుడు ఈ కింది పత్రాల (జిరాక్స్ + వెరిఫికేషన్ కోసం ఒరిజినల్స్) సెట్ సిద్ధం చేసుకోవాలి:
-
సొసైటీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్.
-
అసోసియేషన్ పాన్ కార్డ్.
-
బై-లాస్ (Bye-laws) కాపీ.
-
కమిటీ తీర్మానం (ఒరిజినల్ Resolution Letter).
-
ఎన్నుకోబడిన కమిటీ సభ్యుల లిస్ట్.
-
KYC: చెక్కులపై సంతకం చేసే వారి (ఆథరైజ్డ్ సిగ్నేటరీస్) ఆధార్, పాన్ మరియు ఫోటోలు.
🚀 Subscribe to Ramthamedia WhatsApp & Telegram Channels for News, Articles, Reviews & Books!రామ్తామీడియా లేటెస్ట్ వార్తలు, ప్రత్యేక కథనాలు మీ ఫోన్లో అందుకోవడానికి ఇప్పుడే సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
దశ 5: యాక్టివేషన్ సాధారణంగా హౌసింగ్ సొసైటీలకు కొన్ని బ్యాంకులు ‘సేవింగ్స్ అకౌంట్’ ఇస్తాయి. మెయింటెనెన్స్ కోసం కాబట్టి ‘సేవింగ్స్’ అయితే మంచిది (వడ్డీ వస్తుంది), లేకపోతే ‘కరెంట్ అకౌంట్’ తీసుకోవాలి. అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే 2-3 రోజుల్లో ఖాతా యాక్టివేట్ అవుతుంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ‘Maker and Checker’ (ఒకరు పేమెంట్ క్రియేట్ చేస్తే, మరొకరు అప్రూవ్ చేసే పద్ధతి) సదుపాయం తీసుకుంటే భద్రత ఉంటుంది.
ఆచరణాత్మక సవాళ్లు – వాస్తవ దృశ్యం
పైన చెప్పిన విధానం వినడానికి చాలా పకడ్బందీగా, చట్టబద్ధంగా అనిపించినా… ఆచరణలో మాత్రం అనేక ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా కమిటీ మారిన ప్రతిసారీ బ్యాంకుల్లో వచ్చే తలనొప్పులు అన్నీ ఇన్నీ కావు.
-
ప్రెసిడెంట్ లేదా సెక్రటరీ మారినా, మరణించినా, లేదా ఉద్యోగ రీత్యా వేరే ఊరికి/విదేశాలకు వెళ్ళినా… ఆ ఖాతాను ఆపరేట్ చేయడానికి బ్యాంకులు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.
-
కొత్త కమిటీ వివరాలు అప్డేట్ అయ్యేలోపు, బ్యాంకులు ఖాతాను స్తంభింపజేసే (Freeze) ప్రమాదం ఉంది. దీనివల్ల అత్యవసర సమయంలో మెయింటెనెన్స్ డబ్బులు బ్యాంకులోనే ఇరుక్కుపోయి, విత్ డ్రా కాక మురిగిపోతున్న సందర్భాలు అనేకం. అలాంటి అపార్ట్ మెంట్స్ ల అసోసియేషన్స్ డబ్బు బ్యాంకుల్లో కొట్ల కొద్ది వేస్ట్ గా పడిఉంది.
చిన్న అపార్ట్మెంట్లకి పరిష్కారం – వ్యక్తిగత ఖాతా నిర్వహణ
20 నుండి 30 ఫ్లాట్ల లోపు ఉండే చిన్న అపార్ట్మెంట్లకు, ఈ పెద్ద పెద్ద బై-లాస్, రిజిస్ట్రేషన్లు, కార్పొరేట్ తరహా బ్యాంక్ ఖాతాల కంటే.. ఒక సరళమైన ప్రత్యామ్నాయ మార్గం ఉంది. అదే “నమ్మకస్తులైన సభ్యుడి పేరిట ప్రత్యేక వ్యక్తిగత ఖాతా”.
కార్యదర్శి లేదా కోశాధికారి పేరు మీద ఒక ప్రత్యేకమైన ‘వ్యక్తిగత సేవింగ్స్ అకౌంట్’ (Personal Savings Account) నిర్వహించడమే చిన్న అపార్ట్మెంట్లకు అన్ని విధాలా ఉత్తమం.
దీనివల్ల కలిగే లాభాలు:
-
సులభమైన ఆపరేటింగ్ (Ease of Operation): గూగుల్ పే (GPay), ఫోన్ పే, నెట్ బ్యాంకింగ్ ద్వారా క్షణాల్లో ప్లంబర్లకు, ట్యాంకర్లకు పేమెంట్ చేయవచ్చు. చెక్కుల మీద ఇద్దరు సంతకాలు పెట్టే పని, బ్యాంకుకు తిరిగే పని తప్పుతుంది.
-
తక్షణ మార్పు (Easy Handover): బాధ్యత వహిస్తున్న వ్యక్తి ఇల్లు మారుతున్నా, విదేశాలకు వెళ్తున్నా.. వెంటనే కొత్త వ్యక్తికి ఆ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ మొత్తాన్ని ట్రాన్స్ ఫర్ చేసి, బాధ్యత అప్పగించవచ్చు. బ్యాంక్ డాక్యుమెంటేషన్ గొడవ ఉండదు.
-
నిధుల భద్రత: డాక్యుమెంట్లు సరిగ్గా లేవని బ్యాంకులు ఖాతాను సీజ్ చేసే సమస్య ఉండదు. మన డబ్బు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేతికి అందుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు: అయితే, ఈ పద్ధతిలో కొన్ని చిన్న జాగ్రత్తలు తప్పనిసరి:
-
ప్రత్యేక ఖాతా (Dedicated Account): ఆ వ్యక్తి తన సొంత జీతం పడే ఖాతాను కాకుండా, కేవలం అపార్ట్మెంట్ కోసం ఒక కొత్త ఖాతా ఓపెన్ చేసి వాడటం మంచిది. దీనివల్ల సొంత డబ్బు, అపార్ట్మెంట్ డబ్బు కలవదు.
-
పారదర్శకత (Transparency): వ్యక్తిగత ఖాతా వాడుతున్నారు కాబట్టి, నమ్మకం చాలా ముఖ్యం. ప్రతినెలా బ్యాంక్ స్టేట్మెంట్ను అపార్ట్మెంట్ వాట్సాప్ గ్రూప్‌లో పెడితే ఎవరికీ అనుమానాలు ఉండవు.
-
ఆదాయపు పన్ను పరిమితి (IT Alert): సేవింగ్స్ ఖాతాలో ఏడాదికి రూ. 10 లక్షల కంటే ఎక్కువ నగదు జమ లేదా బదిలీలు (Transactions) జరిగితే ఆదాయపు పన్ను శాఖ నుండి నోటీసులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 30 ఫ్లాట్ల లోపు ఉన్నవారికి ఇది సురక్షితం. అంతకంటే ఎక్కువ టర్నోవర్ ఉంటే మాత్రం అసోసియేషన్ అకౌంటే దిక్కు.
ముగింపు: చట్టం కంటే సౌకర్యం ముఖ్యం అనుకున్నప్పుడు, ముఖ్యంగా చిన్న కమ్యూనిటీలలో (Small Gated Communities), “వ్యక్తిగత ఖాతా నిర్వహణే” తెలివైన, సులువైన మరియు ఆచరణీయమైన పరిష్కారం. పెద్ద అపార్ట్మెంట్లు మాత్రం తప్పనిసరిగా అసోసియేషన్ అకౌంట్ పద్ధతిని పాటించాలి.